పొట్ట ఆదికంగా ఉందా....అయితే ఈ ఆసనాలు చేయండి.

విపరీత నౌకాసనం




బోర్లాపడుకొని రెండు చేతులు ముందుకు చాచి ఉంచి రెండు కాళ్లని రెండు చేతులని తలను సాధ్యమైనంత వరకు శ్వాస తీసుకొంటూ పైకి లేపి ఉంచాలి. ఇలా పది సెకన్లు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. తిరిగి మరలా ఇదే విధంగా పది సార్లు చెయ్యాలి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు శరీర బరువంతా పొట్టమీద ఉంటుంది. చాలా త్వరగా కొవ్వు తగ్గుతుంది. వెన్నెముకకు శక్తిలభిస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
కటి ఆసనం



వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లను తొంభై డిగ్రీల కోణంలో లేపి ఉంచాలి. తల, భుజాలు కొద్దిగా లేపి రెండు చేతులతో కాళ్లను పట్టుకొని సాధ్యమైనంత వరకు తలని మోకాళ్ల వైపునకు తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యాలి. ఈ ఆసనంలో పది నుంచి ముప్ఫై సెకన్ల వరకు ఉండొచ్చు. తర్వాత మెల్లగా విశ్రాంతి తీసుకోవాలి. తిరిగి ఇదే విధంగా మూడు సార్లు చెయ్యాలి. ఈ ఆసనం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్లు పట్టుకొని తలని లేపడం కష్టం. సాధన చేస్తే తేలిక అవుతుంది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ ఉన్నవాళ్లు దీనిని చెయ్యకూడదు.
హలాసనం




వెల్లకిలా పడుకుని రెండు చేతులూ కాళ్ల పక్కన ఉంచి రెండు కాళ్లు నెమ్మదిగా తొంభై డిగ్రీల కోణంలోకి వచ్చేట్టుగా తీసుకురావాలి. అక్కడ నుంచి రెండు కాళ్లను చాలా నెమ్మదిగా తల వెనక్కి తీసుకెళ్లాలి. మోకాళ్లని వంచకూడదు. రెండు కాళ్లు నిదానంగా వెనక్కి తెచ్చి నేలను తాకించాలి. ఈ ఆసనంలో ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు ఉండి నెమ్మదిగా యథాస్థితికి రావాలి. ఈ ఆసనం నెమ్మదిగా చేయాలి. ఆ సమయంలో మాట్లాడ్డం, నవ్వడం చెయ్యకూడదు. యథాస్థితికి వచ్చేప్పుడు తల లేవకుండా చూసుకోవాలి. ఈ ఆసనంతో పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. వెన్నెముకబలం. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ ఉన్న వాళ్లు దీనిని చెయ్యకూడదు.
అగ్నిసార




సుఖాసనం లేదా వజ్రాసనంలో కూర్చుని దీనిని చేయొచ్చు. వెన్నెముకని నిటారుగా ఉంచి మెల్లగా శ్వాస తీసుకొంటూ పూర్తిగా గాలిని బయటకు వదిలేయాలి. అలానే ఉండి పొట్టను ముందుకు వెనక్కి కదిలించాలి. ఈ స్థితిలో ఎన్నిసార్లు కదిలించగలిగితే అన్నిసార్లు కదిలించి అప్పుడు శ్వాస తీసుకోవాలి. తిరిగి మరల ఇదే విధంగా ఐదారుసార్లు చెయ్యాలి. మొదట్లో ఎక్కువ సార్లు చెయ్యలేరు. సాధనతో నిమిషానికి యాభై సార్ల వరకు చేయొచ్చు. ఇది చేసేటప్పుడు గాలి తీసుకోకూడదు. ఇలా ఐదారు సార్లు చేసి విశ్రాంతి తీసుకోవాలి. దీనితో పొట్ట తగ్గడమే కాకుండా ఉదర భాగంలోని అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. ఇది చేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉదయాన్నే చెయ్యాలి. పెప్టిక్‌ అల్సర్లు, హెర్నియా ఉన్నవాళ్లు చెయ్యకూడదు.
మకరాసనం 




ఈఆసనం చేస్తున్నప్పుడు మొసలి ముందుకు నడిచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే మకరాసనం అంటారు. పొట్ట తగ్గించుకోవడానికి ఇది అద్భుత ఆసనం. బోర్లా పడుకుని రెండు అరచేతి వేళ్లను కలిపి చుబుకం కింద ఉంచాలి. చేతులు, భుజాలని కొంచెం పైకి లేపి శ్వాస వదులుతూ కుడికాలిని పైకి మడిచి ఉంచి ఎడమ వైపు చూడాలి. చేతులు కింద పెట్టకూడదు. శ్వాస తీసుకొంటూ యథాస్థితికి రావాలి. అదే విధంగా శ్వాస వదులుతూ ఎడమ కాలు మడిచి కుడి వైపునకు తిరిగి చూడాలి. ఇలా మార్చిమార్చి పది నుంచి ఇరవై సార్లు వరకు చెయ్యాలి. చేసేటప్పుడు చేతులు మాత్రం కింద పెట్టకూడదు. ప్రతిరోజు సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నడుం నొప్పి, వెన్ను సమస్యలున్న వారు నిపుణుల పర్యవేక్షణలో చెయ్యాలి.
      
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top