Maha Narayana Tailam - Ayurvedic Oil



మహానారాయణ తైలం
ఈ తైలం తయారీలో 'శతావరి' అనే మూలికను ప్రధానంగా వాడతారు. శతావరికి నారాయణి అనే పర్యాయపదం ఉండడం వల్ల ఈ తైలాన్ని నారాయణ తైలమని, మహానారాయణ తైలమని పిలుస్తారు. చర్మంపైన అభ్యంగ (మసాజ్) రూపంలోగానీ, కడుపులోకి తీసుకోవడానికి గానీ ఈ తైలాన్ని వాడతారు. అయితే తాగడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే వస్తి (ఎనిమా) రూపంలోనూ శరీరానికి అందించవచ్చు. చెవి, ముక్కు వ్యాధుల్లో, ఆ భాగాల్లో వేసే చుక్కల మందుగా కూడా ఈ తైలం వాడుకలో ఉంది.
తైలంలో...
ఇందులోని అంశాలు మూడు రూపాల్లో ఉంటాయి .
కల్కాంశం :
దోష్టు, ఏలకులు, మంచిగంధం, బలా మూలాలు, జటామాంసీ, ఛఠీలా, సైందవ లవణం, అశ్వగంధ, వచా, రాస్నా, సోంపు, దేవదారు, సుగంధిపాల, పాఠా, మాషపర్ణీ, ముద్గపర్ణీ, తగర వీటన్నిటినీ పొడిచేసి, నీటితో కలిపి ముద్దగా (కల్కం) చేసి పెట్టుకోవాలి.

తైలాంశం:
తయారు చేసుకున్న ముద్ద తూకానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకోవాలి.
ద్రవాంశం:
అశ్వగంధ, బలామూలాలు, బిల్వమూలాలు, బృహతీద్వయం, పల్లేరు, సంబరేణు, పాఠామూలాలు, పునర్నవా, ముద్గ, రాస్నా, ఏరండమూలం, దేవదారు, ప్రసారణీ, అరణీ ఈ మూలికలకు నీళ్లు చేర్చి సిద్ధం చేసిన కషాయద్రవం ఒక భాగం, శతావరీ రసం ఒక భాగం, పాలు ఒక భాగం. ఇవన్నీ కలిపి తైలాంశానికి మళ్లీ నాలుగు రెట్లు తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక పెద్ద పాత్రలో కలిపేసుకుని, ద్రవాంశం పోయి, తైలాంశం మాత్రమే మిగిలేలా పొయ్యి మీద ఉడికించాలి.

తైలగుణాలు:
తైలం తయారీలో ఉపయోగించిన ఈ మూలికలన్నీ శరీరంలో విషమించే వాతదోషాల్ని ఉపశమింపచేసేవి, శక్తిని ప్రసాదించేవి. మూలికల గుణాలను శరీరానికి అందించడంలో తైలం ఒక వాహకంలా పనిచేస్తుంది. ఈ తైలంతో చర్మం మీద మర్దన చేసినప్పుడు చేష్టానాడులు, రక్త వహి సిరా ధ మనులు, స్నాయు, పేశీకండరాలు ప్రేరణ పొంది మరింత శక్తివంతమవుతాయి. 


బలహీనపడిన అవయవాలు బలపడి తమ విధులను శక్తివంతంగా నిర్వహిస్తాయి. మర్ధనలోని హస్తలాఘవం (మానిప్యుటేషన్ స్కిల్స్) ప్రభావంతోనే ఈ శరీర క్రియలు సాధ్యమవుతాయి. ఫిజియోథెరపీలో వివిధ తైలాలతో చేసే 'మసాజ్' ప్రాచుర్యానికి రావడానికి ఈ విధానమే కారణం.

ఈ మసాజ్‌కు నారాయణ తైలం కూడా తోడైతే ఫలితాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అవయవాల శక్తిసామర్థ్యాన్ని పెంచడంతో పాటు నొప్పులను త గ్గించడంలో నారాయణ తైలానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం పైపూతగానే ఈ తైలం ఎక్కువగా వాడుకలో ఉంది.

అయితే ఈ తైలాన్ని కడుపులోకి తీసుకున్నప్పుడు ఇది నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే చెవిలో చుక్కలుగా వేయడం వల్ల చెవినొప్పి, ముక్కులో వేయడం వల్ల తలనొప్పి, తలకు సంబంధించిన మరికొన్ని ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. రోగి పక్షవాతం వంటి సమస్యలతో కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు మర్ధన గానీ, కడుపులోకి ఇవ్వడం గానీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో నారాయణ తైలాన్ని ఎనీమాగా పేగుల్లోకి ఎక్కించ వచ్చు.ఇలా చేయడం వల్ల పేగుల్లోని పొర (మ్యూకోజా) ద్వారా ఔషధ గుణాలు శరీరానికంతా వెళ్లే అవకాశం ఉంది.

ఏ వ్యాధులకు..?

వాత వ్యాధులకు, కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడంలో నారాయణ తైలానికి ప్ర«థమ స్థానం ఉంది. వీటితో పాటు పక్షవాతం, అర్థత వాతం (ఫేషియల్ పెరాలిసిస్), దవడ-మెడ పట్లు, భుజాలు పడిపోవడం (బ్రేకియల్ పాల్సీ) కటిశూల (డిస్క్, బ్యాక్‌పెయిన్) పార్శ్వశూల, కుంటడం, నడుము వంగిపోవడం, గృధసీ వాతం (సయాటికా) వంటి సమస్యలను తగ్గించడంలోనూ ఈ తైలం బాగా పనిచేస్తుంది.

వీటితో పాటు అవయవాలు ఎండిపోవడం, చెవినొప్పి, వినికిడి లోపం, వృషణాల నొప్పి, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటివి ఈ తైలంతో తగ్గుముఖం పడతాయి. సర్వైకల్, లుంబార్ స్పాండిలోసిస్ ఉన్నవారు మర్ధనంతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వస్తి (ఎనిమా) కూడా చేయించుకుంటే లామినెక్టమీ శస్త్ర చికిత్స అవసరమే లేకుండా పోతుంది.


పైన పేర్కొన్న అన్ని వ్యాధుల్లోనూ నారాయణ తైలంతో మర్ధన చేసి ఆ తరువాత వేడినీళ్లతో స్నానం చేయడం గానీ, నొప్పిగా ఉన్న చోట వేడినీళ్లతో కాపడం పెట్టడం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఫలితం రెట్టింపుగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top